క్రికెట్ ఆడిన మల్లారెడ్డి.. మేడ్చల్, శామీర్‌పేట ప్రాంతాలలో పాఠశాలల ప్రారంభోత్సవం

  • మేడ్చల్, శామీర్‌పేట ప్రాంతాలలో సీఎంఆర్, మల్లారెడ్డి పాఠశాలలను ప్రారంభించిన మల్లారెడ్డి
  • మేడ్చల్ ప్రజలు తనను మూడు సార్లు గెలిపించారన్న మల్లారెడ్డి
  • దీనికి కృతజ్ఞతగా నియోజకవర్గంలోని ప్రతి మండలంలో పాఠశాలలు ఏర్పాటు చేస్తామని వెల్లడి

మేడ్చల్ నియోజకవర్గంలో విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా మాజీ మంత్రి మల్లారెడ్డి సరికొత్త అడుగులు వేశారు. స్థానిక విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా కొత్త విద్యా సంస్థలను ఆయన ప్రారంభించారు. మేడ్చల్, శామీర్‌పేట ప్రాంతాలలో నూతనంగా ఏర్పాటు చేసిన సీఎంఆర్, మల్లారెడ్డి పాఠశాల బ్రాంచ్‌లను మల్లారెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి సరదాగా గడిపారు. వారితో క్రికెట్ ఆడి, అక్కడి వాతావరణంలో ఉత్సాహాన్ని నింపారు. విద్యార్థులను ప్రోత్సహిస్తూ మల్లారెడ్డి చేసిన సందడి అందరినీ ఆకట్టుకుంది.


అనంతరం జరిగిన సభలో మల్లారెడ్డి మాట్లాడుతూ... తనను వరుసగా మూడుసార్లు గెలిపించిన మేడ్చల్ నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని అన్నారు. వారికి కృతజ్ఞతగా వారి పిల్లలకు అతి తక్కువ ఫీజులతోనే నాణ్యమైన కార్పొరేట్ విద్యా సౌకర్యాలను కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా నియోజకవర్గంలోని ప్రతి మండలంలో ఒక సీఎంఆర్ స్కూల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. భవిష్యత్తులో అవసరమైతే మరిన్ని పాఠశాలలను ప్రారంభిస్తామని, నాణ్యమైన విద్యను అందరికీ చేరువ చేయడమే తమ ఆశయమని స్పష్టం చేశారు.


ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్లు శ్రీదేవి, శిరీష, మున్సిపల్ చైర్మన్ జామూ రవి, మాజీ లైబ్రరీ చైర్మన్ భాస్కర్ యాదవ్, జగన్ రెడ్డి, దయానంద్ యాదవ్, సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Malla Reddy
Medchal
CMR Schools
Shamirpet
Corporate Education
Malla Reddy Schools

More Telugu News